- ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ల తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకూ మరాఠీ, హిందీ మీడియంలో రాసే విద్యార్థులకు చేతి రాతతో తయారు చేసిన క్వశ్చన్ పేపర్లు అందించేవారు. కానీ, ఈ విద్యాసంవత్సరం నుంచి ఆయా మీడియం విద్యార్థులకూ ఇతర మీడియం విద్యార్థుల మాదిరిగానే ప్రింటింగ్ క్వశ్చన్ పేపర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. మరాఠీ మీడియంలో సుమారు 300 మంది వరకూ ఇంటర్ కోర్సు చదువుతుండగా, హిందీ మీడియంలో సుమారు వంద మంది చదువుతున్నారు. ఈ నెల 4న ‘ఇంటర్ ఎడ్యుకేషన్ లో ఇన్ చార్జ్ ల పాలన’ శీర్షికతో వెలుగులో ప్రచురితమైన కథనానికి సర్కారు స్పందించింది. దీంట్లో ఇప్పటికీ పరీక్షలకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదనే అంశాన్ని ప్రధానంగా ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో వెంటనే పరీక్షల పనులు ప్రారంభించాలని ఇంటర్మీడియేట్ అధికారులను సర్కారు పెద్దలు ఆదేశించారు.దాంతో ఈ నెల 6 నుంచి క్వశ్చన్ పేపర్ల తయారీ ప్రక్రియ ప్రారంభించారు.